Saturday, 26 November 2016

తెలుగు సాహిత్యంలో దండకములు - 3  

ఆంజనేయ దండకం

శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రబాధివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజేవాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్య మిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంభునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాస్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే ధాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్దమై యేగి శ్రీరామ సౌమిత్రులన్ జూచి వారిఁవిచారించి సర్వేశు బూజించి యబ్బానుజుం బంటు గావించి యవ్వాలినిన్ జంపించి కాకుత్త్స తిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కిందకేతెంచి శ్రీరామ కార్యార్దమై లంక కేతెంచియున్ లంకినిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్ యభ్భుమిజన్ జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతుష్టునింజేసి సుగ్రీవునిన్ అంగదున్ జాంబవంతాది నీలున్నీలున్ గూడి యాసేతువున్ దాటి వానరుల్మూకలై పెన్మూకలై యా దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి యా శక్తినివేచి యాలక్ష్మణున్ మూర్చనొందింపగానప్పుడే నీవు సంజీవినిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్ వీరులంబోర శ్రీరామ బానాగ్ని వారందరిన్ రావనున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళను విభీషణున్ వేడుకన్ దోదుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించిసీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చితన్నయోద్యాపురింజొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్బాయునే భయములున్ దీరునే భగ్యముల్ గల్గునే సాంరాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర నీవే సమస్తంబుగా నెంచి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగన్ వజ్ర దేహంబునున్ దాల్చి శ్రీరమ శ్రీరమయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్ తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు తైలోక్య సంచరివై రామ నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శాకినీ డాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచికాలాగ్ని రుద్రండవై బ్రహ్మప్రభా భాసితంభైన నీదివ్యతేజంబునున్ జూచిరారనాముద్దునరసింహాయంచున్,దయాదృష్టివీక్షించినన్నేలు నాస్వామి ! నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే ! వాయుపుత్రా నమస్తే ! నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః
ప్రాముఖ్యత:
 దండకాన్ని హనుమాన్ చాలిసకు మారుగా ప్రతినిత్యం పాటించుకోవచ్చు.భూత ప్రేత భాదలు వున్నవారుభయస్తులు , సరి అయిన దశ లేని వారునిత్య పారాయణం చేసుకొని అనుభవ పూర్వకంగా అభివృద్ధిని పొందగలరు.

Thursday, 13 October 2016

తెలుగు సాహిత్యంలో దండకములు - 2

విఘ్నేశ్వరుని దండకము


 శ్రీ పార్వతీపుత్ర! లోకత్రయ స్తోత్ర! సత్పుణ్య చారిత్ర! భద్రేభవక్త్రా! మహాకాయ! కాత్యాయనీనాథ సంజాత స్వామీ! శివా సిద్ధివిఘ్నేశ! నీపాద పద్మంబులున్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులున్ నీ కరాళంబు నీ పెద్దవక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీమందహాసంబు నీచిన్నతొండంబు నీగుజ్జురూపంబు నీశూర్పకర్ణంబు నీనాగయజ్ఞోపవీతంబు నీభవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతల్జామ్రొలున్ చంపకంబుల్ తగన్ మల్లెలన్మొల్ల లున్మనించి చేమంతులున్ దెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలన్ పువ్వులన్మంచి దూర్వంబులన్దెంచి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి సాష్టాంగముం జేసి విఘ్నేశ్వరా! నీకు టెంకాయ పొన్నంటిపండ్లున్ మఱిన్మంచివౌ నిక్షుఖండంబులున్ రేగుపండ్లప్పడాల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులు న్వడల్ పునుగులున్ బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయున్ జున్ను బాలాజ్యము న్నానుబియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్ళెమందుంచి నైవేద్యముం బంచనీరాజనంబున్ నమస్కారముల్ జేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్థనల్చేయుటల్ కాంచనంబొల్లకే యిను దా గోరు చందంబుగాదే మహాదేవ యో దేవచూడామణీ! లోకరక్షామణీ! బంధుచింతామణీ! స్వామీ! నిన్నెంచ నేనెంత? నీ దాసాదిదాసుండ, శ్రీ దొంతరాజాన్వయుండ, రామాభిధానుడ, నన్నిపుడు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్చూచి హృత్పద్మ సింహాసనారూఢత న్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియు న్విద్యయు న్పాడియు\న్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా జేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! యివే వందనంబుల్ శ్రీగణేశా! నమస్తే నమస్తే నమస్తే నమః!!
తెలుగు సాహిత్యంలో దండకములు - 1

ప్రవేశిక

ఆదికవి నన్నయ్యనుండి, ఆధునిక కవులవరకూ, ఎందరో కవులు తమ సాహిత్య సృష్టిలో, దండకమును ఒక చందోరీతిగా ఎన్నుకొన్న విషయం మనకు తెలిసినదే. ప్రాచీనకవులు, అధునిక కవులు, సినిమా కవులు ఇలా అన్ని వర్గాల కవులూ దండకమును  ఒక ఛందోరీతిగా స్వీకరించిన వారే.

పొతనామత్యుడు శ్రీమదాంధ్ర భాగవతములో కధానుసారముగా కొన్ని దండకములు రచించడమే కాక, "భోగినీ దండకము" అను పేర ఒక గ్రంధం మొత్తమును ఈ ఛందో రీతిలో రాయడం, తెలుగు సాహిత్యంలో అరుదైన విషయం. తర్వాత కవులలో కూడా యెందరో భక్తి ప్రధానమైన దండకములు రూపొందించి, చిన్న చిన్న గ్రంధములుగా ప్రకటించిన సంఘటనలు కోకొల్లలు.

అయితే వివిధ కవులు, దండకమును ఒక ఛందోరీతి గా ఎన్నుకొన్న సందర్భాలు వేరు.  ఆసందర్భాలను వర్గీకరిస్తే, ప్రార్ధనా పరమైన దండకములు, కధా ప్రధానమైన దండకములు, వ్యంగ్యంతో కూడిన హాస్య భరితమైన దండకములు, మొదలైన వివిధ రీతుల దండకములు,  తెలుగు  సాహిత్యంలో కనిపిస్తాయి. అటువంటి అనేకమైన దండకములలో, వీలైనన్నింటిని ఈ "రసధుని" బ్లాగు ద్వారా మన ఇక్కడ పరిచయం చేసుకుందాం.

ఈ "దండకము" అనే ఛందోరీతికి ఛందోనియమాలేమిటి? దండకములన్నీ ఒకే ఛందోరీతిలో సాగుతాయా? - ఇటువంటి విషయాలను కూడా మనం ఇక్కడ వీలువెంట ప్రస్తావించు కుందాం. రండి. మనం ఇప్పుడు ఒక్కొక్క దండకమును అస్వాదిస్తూ ముందుకు సాగుదాం.

ధన్యవాదములు

బుధజనవిధేయుడు



చల్లా రామలింగశర్మ.
శ్రీకారం


సాహితీ మిత్రులకు నమస్కారములు.

తెలుగు సాహిత్యము మీద ఉన్న మక్కువతో, అప్పుడప్పుడు నేను సేకరించుకొన్న కొన్ని విషయాలను, సాహితీ మిత్రులతో పంచుకోవాలనే ఉద్దేశంతో,  "రసధుని" పేరుతో ఈ బ్లాగు ఆవిష్కరించ బడుతున్నది. ఇందులోనేను సేకరించుకున్న విషయాలను, నేను తయారుచేసుకున్న విశ్లేషణలనూ పొందు పరచాలని ఆలోచన.

ఈ సేకరణలను, ఇలా బ్లాగులో రూపొందిస్తాననే అలోచన లేక, కొన్ని అంశముల విషయంలో, గ్రంధం పేరుగానీ, రచయిత పేరు గానీ, గుర్తుగా రాసుకోని పరిస్తితి వలన, నా దగ్గర ఉన్నంతమటుకు, మూల గ్రంధం పేరు, రచయిత పేరు, ఉదరించడం జరుగుతుంది.

ఏదైనా అంశం ఈ బ్లాగులో ప్రకటించడం గురించి, ఎవరికైనా అభ్యంతరం ఉంటే తప్పక తెలియ చేయగలరు. అభ్యంతరం సహేతుకమైనదైతే ఆ అంశం బ్లాగులో నుండి వెంటనే తీసివేయ బడుతుంది.
 ఈ "రసధుని" బ్లాగు లో ప్రకటించబడే అంశములను ఆస్వాదిస్తూ, మీమీ అభిప్రాయాలను తెలియ చేస్తూ, నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ..

ధన్యవాదములతో

బుధజన విధేయుడు



చల్లా రామలింగ శర్మ