తెలుగు సాహిత్యంలో దండకములు - 2
విఘ్నేశ్వరుని దండకము
శ్రీ పార్వతీపుత్ర! లోకత్రయ స్తోత్ర!
సత్పుణ్య చారిత్ర! భద్రేభవక్త్రా! మహాకాయ! కాత్యాయనీనాథ సంజాత స్వామీ! శివా సిద్ధివిఘ్నేశ! నీపాద పద్మంబులున్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులున్ నీ కరాళంబు నీ పెద్దవక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీమందహాసంబు నీచిన్నతొండంబు నీగుజ్జురూపంబు నీశూర్పకర్ణంబు నీనాగయజ్ఞోపవీతంబు నీభవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతల్జామ్రొలున్ చంపకంబుల్ తగన్ మల్లెలన్మొల్ల లున్మనించి చేమంతులున్ దెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలన్ పువ్వులన్మంచి దూర్వంబులన్దెంచి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి సాష్టాంగముం జేసి విఘ్నేశ్వరా!
నీకు టెంకాయ పొన్నంటిపండ్లున్ మఱిన్మంచివౌ నిక్షుఖండంబులున్ రేగుపండ్లప్పడాల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులు న్వడల్ పునుగులున్ బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయున్ జున్ను బాలాజ్యము న్నానుబియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్ళెమందుంచి నైవేద్యముం బంచనీరాజనంబున్ నమస్కారముల్ జేసి విఘ్నేశ్వరా!
నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్థనల్చేయుటల్ కాంచనంబొల్లకే యిను దా గోరు చందంబుగాదే మహాదేవ యో దేవచూడామణీ! లోకరక్షామణీ! బంధుచింతామణీ! స్వామీ!
నిన్నెంచ నేనెంత? నీ దాసాదిదాసుండ,
శ్రీ దొంతరాజాన్వయుండ, రామాభిధానుడ, నన్నిపుడు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్చూచి హృత్పద్మ సింహాసనారూఢత న్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియు న్విద్యయు న్పాడియు\న్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా జేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! యివే వందనంబుల్ శ్రీగణేశా! నమస్తే నమస్తే నమస్తే నమః!!
No comments:
Post a Comment